సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి రానున్నారు.. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్‌లో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదిక.. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి గత నాలుగు రోజులుగా… వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి.. ఈ విషయాలు అన్నింటి మీద కూడా చర్చ జరగనుంది. దీంతోపాటు కూటమి నేతలు మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు.. టీటీడీ తిరుమల తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది.. దీంతోపాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకి వచ్చింది.. ఆ దిశగా చర్చ జరగనుంది. మూడు పార్టీలు కలిసి అందులో ప్రధానంగా జనసేన కూడా ఉంది కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లే విధంగా సీఎం.. డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది…
నేడు గుంటూరు వైఎస్ జగన్.. మాజీ మంత్రి అంబటి కుటుంబానికి పరామర్శ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న వైఎస్ జగన్, ఉదయం 11 గంటలకు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు నివాస సమీపంలో దాడికి గురైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలతో పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి లోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోహన్‌బాబు, విష్ణును అరెస్ట్ చేయండి.. MBU గుర్తింపు రద్దు చేయండి.. విద్యార్థి సంఘాల డిమాండ్
మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. విద్యార్థి నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కిడ్నాప్ రాజకీయాలు పూర్తిగా నశించాలంటూ గళం విప్పాయి. మోహన్‌బాబు యూనివర్సిటీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన విద్యార్థి సంఘాల నేతలు, MBUకి ఉన్న గుర్తింపును తక్షణమే రద్దు చేసి యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు SFI, AISF, NSUI, PDSU సంఘాలు ఐక్యంగా మద్దతు ప్రకటించాయి. విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ, ఐక్య కార్యాచరణతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ్టి నిరసనకు విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు భారీగా తరలిరావాలని విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందని ప్రకటించారు. కాగా, మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఇద్దరు నేతలను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించిన విషయం విదితమే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు.. డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందు డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు.. అరెస్ట్ అనంతరం సస్పెండ్ అయ్యారు. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో SIB (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) డీఎస్పీగా పని చేసిన దుగ్యాల ప్రణీత్ రావు కిందట సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయనపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారశైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలటంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2023 నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని… మావోయిస్టుల నేతలతో వీరికి సంబంధాలు ఉన్నాయంటూ రాజకీయ నేతల నెంబర్లను పంపించి రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఫోన్‌లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాటికి సంబంధించి ప్రభాకర్ రావును కూడా దాదాపు మూడు సార్లు విచారించారు సిట్ అధికారులు. తాజాగా ప్రభాకర్ రావు డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేయడం సంచలనంగా మారింది.
బీజేపీకి జనసేన సపోర్ట్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్..
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ ప్రచారాల్లో మునిగిపోయారు. ఓ వైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నిన్న(మంగళవారం) తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చలు రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశం అనంతరం రామచందర్‌రావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయ్యాం. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాం. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారు. ఇది తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు తిరుగులేని వేగాన్ని అందిస్తుంది.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అమెరికాలో జైశంకర్ పర్యటన.. ఆర్థిక సంబంధాలపై చర్చ
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత ధృడమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌పై సుంకాన్ని 50 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ట్రంప్ నుంచి ప్రకటన రాగానే ఇరు దేశాల మధ్య ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ అయితే ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. పెట్టుబడిదారుల పంట పండింది. దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపాదన జేబుల్లో పడింది. ట్రంప్ దగ్గర నుంచి సానుకూల ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికాలో పర్యటిస్తూ వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అమెరికా ఉన్నతాధికారులను కలిసి రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను జైశంకర్ కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. జైశంకర్ ట్వీట్ చేస్తూ… ‘‘ఈరోజు వాషింగ్టన్ డీసీలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను కలవడం సంతోషంగా ఉంది. భారతదేశం – అమెరికా ఆర్థిక భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం పురోగతిపై ఉపయోగకరమైన చర్చ జరిగింది..’’ అని రాసుకొచ్చారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చేసిన అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్‌ల మధ్య వార్నింగ్‌లు.. బెదిరింపులు జరుగుతున్నాయి. డిసెంబర్ 28న ఇరాన్‌లో మొదలైన నిరసనల దగ్గర నుంచి ఇప్పటి దాకా ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. భద్రతా కాల్పుల్లో 30 వేల మంది నిరసనకారులు చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఇరాన్ సమీపంలోకి అమెరికా యుద్ధ నౌకలు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన నౌక మోహరించి ఉంది. అయితే మంగళవారం ఈ నౌక సమీపంలోకి ఇరానియన్ డ్రోన్ రాబోతుండగా అమెరికా సైన్యం అప్రమత్తమై కూల్చేసింది. ఆత్మ రక్షణ కోసం డ్రోన్‌ను కూల్చేసినట్లుగా అమెరికా సైన్యం పేర్కొంది. అయితే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధపడుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతలు మొదలవుతాయేమోనన్న ఉత్కంఠ నెలకొంది.
T20 ప్రపంచ కప్ వివాదం.. నేడు భారత్- పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లు
టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్మ్-అప్ మ్యాచ్‌లు అభిమానులకు అదనపు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు జరగనుండగా, భారత్- పాకిస్థాన్ రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాయి. భారత జట్టు ఈరోజు సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సాయంత్రం 5 గంటలకు పాక్ జట్టు ఐర్లాండ్‌తో పోటీ పడుతుంది. అయితే, మైదానం బయట పరిస్థితులు మాత్రం రెండు జట్లకూ అనుకూలంగా లేవు.. ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో జరగాల్సిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే పీసీబీ ఇప్పటికే ప్రకటించింది. మెగా టోర్నమెంట్‌లో టీమిండియాతో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వమే అనుమతి నిరాకరించిందని తెలుస్తుంది. ఈ అంశంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా సరే, ఇరు జట్లు మైదానంపై దృష్టి సారించి తమ తొలి మ్యాచ్‌లకు సిద్ధమవడం కీలకంగా మారింది. వార్మ్-అప్ మ్యాచ్‌లు జట్లకు సరైన సమన్వయం సాధించేందుకు ఉపయోగపడనున్నాయి.
ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైజ్ కు ‘వారాణసి’ నెట్ ఫ్లిక్స్ డీల్..
రాజమౌళి – మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతోంది వారణాసి. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కి కారణం అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్ల భారీ ఆఫర్‌ను మేకర్స్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని భారీ ధర కావడం విశేషం. ఈ భారీ డీల్‌లో భాగంగా ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా సినిమాలు విడుదలైన 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ, ‘వారణాసి’ టీమ్ థియేట్రికల్ విండో చాలా ఎక్కువగా ఉండేలా చర్చలు జరుపుతోంది. అంటే సినిమా థియేటర్లలో విడుదలైన చాలా కాలం తర్వాత సుమారుగా రెండు లేదా మూడు నెలలు ఓటీటీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలకు థియేటర్లలో ఉండే డిమాండ్ దృష్ట్యా, కనీసం 8 వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘RRR’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘వారణాసి’ కోసం ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. అయితే, మేకర్స్ ఇంకా భారీ డీల్ ఆశిస్తున్నట్లు, అందుకే చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే, కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్‌లో సగం రికవరీ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటీనటులు ఉండటం కూడా ఈ రేంజ్ బిజినెస్‌కు ప్రధాన కారణం. 2027లో ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది.
వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ‘F3’ సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో, ఈసారి మెయిన్ హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఆమెతో కనీసం చర్చలు కూడా జరపలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పేసింది. మరోవైపు, టాలీవుడ్‌లో సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూజా హెగ్డేకు ఒక బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. వరుస హిట్లతో దూసుకుపోతున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె ఛాన్స్ కొట్టేసిందట. ఒక పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో దుల్కర్ హీరోగా నటిస్తుండగా, అందులో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు కథా పరంగా చాలా ప్రాధాన్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం పూజా హెగ్డే తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లో పెట్టేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వెంకటేష్ సినిమా రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడినా, దుల్కర్ సల్మాన్ వంటి క్రేజీ హీరో పక్కన ఛాన్స్ రావడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా పూజాకి తెలుగులో పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!
వారణాసి 2 పార్ట్స్.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియాతో వారణాసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, రన్ టైమ్ తో పాటు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రాజమౌళి మాట్లాడుతూ, “నా ప్రతి సినిమాలోనూ రామాయణం, మహాభారతం యొక్క స్ఫూర్తి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు. మేము రామాయణంలోని ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాము. వారణాసి కేవలం భారతీయ సంస్కృతి మరియు కథల గురించి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్‌తో సాగుతుంది. ‘RRR’ సినిమాను వరల్డ్ వైడ్ గా ఎలాగైతే ఆదరించిందో, ఈ చిత్రాన్ని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. ఆలాగే వారణాసి టూ పార్ట్స్ పై జక్కన్న స్పందిస్తూ ‘కథ చాలా పెద్దది కావడంతో, ఒక దశలో మేము ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఆలోచించాము. కానీ త్వరగానే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాము. ప్రస్తుతానికి ఈ సినిమా ఒకే పార్ట్‌గా రాబోతోంది. సినిమా నిడివి సుమారు 3 గంటల వరకు ఉంటుంది. ఈ మూడు గంటల ప్రయాణం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని రాజమౌళి వెల్లడించారు. వారణాసి నేపథ్యంగా సాగే ఈ కథలో భారతీయ మూలాలు బలంగా కనిపిస్తాయని, అదే సమయంలో హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉంటుందని తెలుస్తోంది.