Terror attack: వరస ఎన్‌కౌంటర్లతో జమ్మూ కాశ్మీర్ ఉలిక్కిపడింది. రియాసీ బస్సుపై దాడి తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆదివారం కత్రా నుంచి శివ్ ఖోరీకి భక్తులను తీసుకెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు సమీపంలోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిగారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
వరస దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే భద్రతా బలగాలపై కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రాజౌరి, జమ్మూ జిల్లాల్లోని సుందర్‌బానీ, నౌషెరా, దోమన, లంబేరి, అఖ్నూర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాల శిబిరాలపై ఆత్మాహుతి దాడికి అవకాశం ఉందని ఇంటెల్ ఏజెన్సీలు హెచ్చరించాయి.
మంగళవారం కథువాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. దోడా జిల్లాలోని భదేర్వా-పఠాన్ కోట్ రహదారిపై మంగళవారం అర్థరాత్రి రాష్ట్రీయ రైఫిల్స్, పోలీస్ జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న ‘‘కాశ్మీర్ టైగర్స్’’ అనే ఉగ్రసంస్థ దీనికి బాధ్య వహించింది. రియాసి జిల్లాలో ఆదివారం జరిగిన బస్సుపై ఉగ్రదాడిలో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ దాడికి లష్కరేతోయిబా ఉగ్రసంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’ బాధ్యత వహించింది.