S Jaishankar: యూరోపియన్ దేశాలపై మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారతదేశం ‘‘బోధించే వారి’’ కోసం కాదని, భాగస్వాములను కోరుకుంటుందని చెప్పారు.
భౌగోళిక రాజకీయ అంశాలపై న్యూఢిల్లీ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న యూరోపియన్ దేశాలను విమర్శిస్తూ, భారతదేశం “బోధకుల కోసం కాదు” భాగస్వాముల కోసం చూస్తుందని, యూరప్‌లోని కొన్ని దేశాలు “ఇప్పటికీ ఆ సమస్యతో పోరాడుతున్నాయి” అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు OG గ్రిమ్సన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధిపతి సమీర్ సరన్‌తో జరిగిన సంభాషణలో యూరప్ తీరును ఆయన బహిర్గతం చేశారు.
Read Also: Harish Rao : స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం.. హరీష్ రావు ఫైర్..
యూరప్ దేశాల నుంచి భారత్ ఏం ఆశిస్తుందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాము. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, కానీ వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని మారిపోయాయి.’’ అని వెస్ట్రన్ దేశాలను తీవ్రంగా విమర్శించారు.
‘‘ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహన ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థంగా ఉన్నాయి. మరికొన్ని వెనకబడి ఉన్నాయి.’’ అని అన్నారు.
గతంలో కూడా జైశంకర్ వెస్ట్రన్ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాల విషయంలో కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో వెస్ట్రన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల్ని ధిక్కరించి భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఈ నిర్ణయాన్ని వెస్ట్రన్ మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ దిగుమతి చేసుకునే చమురును, యూరప్ మొత్తం మధ్యాహ్నానికే వాడుకుంటుందని చివాట్లు పెట్టారు. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలుగా చూపిస్తుందని, ప్రపంచ సమస్యల్ని మాత్రం పట్టించుకోలేదని అన్నారు.