S Jaishankar: విదేశీ బిలియనీర్ జార్జ్ సోరోస్ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ఆయన వ్యాఖ్యలపై మండిపడుతోంది. నిన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జ్ సోరోస్ పై విమర్శలు గుప్పించారు. ముసలివాడు, ధనవంతుడు, అతని అభిప్రాయాలు ప్రమాదకరమైనవి అంటూ మూడు ముక్కల్లో జార్జ్ సోరోస్ ను అభివర్ణించాడు. మొత్తం ప్రపంచం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని భావించే వ్యక్తి అని జైశంకర్ అన్నారు.
Read Also: Harish Rao: లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 9 ఏళ్లు మంత్రి ట్విట్ వైరల్
జార్జ్ సోరోస్ వంటి వారు తమకు అనుకూలంగా కథనాలు అల్లేందుకు పెట్టుబడులు పెడుతుంటారని.. తమకు నచ్చిన వ్యక్తి అధికారంలోకి వస్తే ఎన్నికలు సక్రమంగా జరిగాయని.. లేకపోతే అవకతవకలు జరిగాయంటారు, స్వేచ్ఛా సమాజం పేరుతో ఇటువంటి వాదనలు చేస్తారంటూ తనదైన శైలితో వ్యాఖ్యానించారు జైశంకర్. అంతకుముందు స్మృతి ఇరానీ కూడా జార్జ్ సోరోస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విదేశీ శక్తులు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుంటారని.. ఇలాంటి వాటిని భారతీయులంతా తిప్పికొట్టాలని అని అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను మోసం చేసిన వ్యక్తి, ఆ దేశంలో యుద్ధఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన వ్యక్తి అంటూ విమర్శించారు.
92 ఏళ్ల జార్జ్ సోరోస్ గురువారం 2023 మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ తర్వాత భారీ స్టాక్ మార్కెట్ పతనాన్ని ఎదుర్కొన్న గౌతమ్ అదానీ వ్యాపార సమస్యలతో ప్రధాని మోదీ బలహీనపడతారని అంచనా వేశారు. ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, కానీ ఆయన నిశ్శబ్ధంగా ఉన్నారని అన్నారు. మోదీ, అదానీ మిత్రులని ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యవాది కాదని.. ముస్లింలపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. భారత్, రష్యా నుంచి చాలా తక్కువ ధరతో చమురు కొనుగోలు చేసి దానిపై చాలా డబ్బు సంపాదిస్తోందని విమర్శించాడు.