Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
‘‘ ఆదిత్య మార్గంలో ఉన్నాడు. ఇది దాదాపు చివరి దశకు చేరుకుందని నేను భావిస్తున్నాను,’’ అని ఇస్రో చీఫ్ మొదటి సౌండింగ్ రాకెట్ లాంచ్ 60వ వార్షికోత్సవం పురస్కరించుకుని వీఎస్ఎస్‌సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెప్పారు. L1 పాయింట్ లోకి స్పేస్ క్రాఫ్ట్‌ని ప్రవేశపెట్టే సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. జనవరి 7 నాటికి తుది విన్యాసాలు జరుగుతాయని సోమనాథ్ చెప్పారు.
Read Also: Yogi Adityanath: అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలి.. వేములవాడ ప్రజలకు పిలుపు
ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ 2న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది. ఆదిత్య ఎల్1 125 రోజుల ప్రయాణించి భూమికి-సూర్యుడికి మధ్య ఉండే L1 పాయింట్(లాగ్రాంజియన్ పాయింట్) వద్ద హాలో కక్ష్యలో చేరుతుంది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ వద్ద సూర్యుడు, భూమిల గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. దీంతో అంతరిక్ష నౌక స్థిరంగా ఎలాంటి గురుత్వాకర్షణ శక్తులకు లోను కాకుండా ఉంటుంది.
సూర్యుడిపై అధ్యయనానికి ఈ ప్రయోగం ఉద్దేశించబడింది. సూర్యుడి కరోనా, సోలార్ తుఫానులు, బ్లాక్ స్పాట్స్, సోలార్ మాస్ ఎజెక్షన్స్ వంటి వాటిపై అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భూమికి పంపుతుంది. సూర్యడికి సంబంధించి చిత్రాలను సేకరిస్తుంది.