Monsoon: ఈ సారి రుతుపవన కాలంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతపవనాలకు అనుకూలంగా పసిఫిక్ మహాసముద్రంలో ‘‘లానినా’’ పరిస్థితులు ఆగస్టు- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. 1951-2023 మధ్య గణాంకాలను పరిశీలిస్తే, ఎల్ నినో తర్వాత లా నినా పరిస్థితులు భారతదేశంలో రుతుపవన కాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేలా చేసిందని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర విలేకరులు సమావేశంలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం అందిస్తుంది, ఇది వ్యవసాయ రంగానికి కీలకం. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా 14 శాతంగా ఉంది.
Read Also: Sridhar Babu: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తాం..
నాలుగు నెలల రుతుపవనా సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాల సగటు( 87 సెం.మీ)లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. వర్షకాలానికి అనుకూలంగా హిందూ మహాసముద్రంలో ‘‘ ఇండియన్ ఓషియన్ డైపోల్’’ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు లా నినా పరిస్థితులు కూడా ఏర్పడితే ఈ రెండు వాతావరణ దృగ్విషయాలు రుతుపవనాల సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓ మోస్తారు ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని, అయితే వర్షకాలం ప్రారంభమయ్యే నాటికి ఇది తటస్థంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2023లో సగటు వర్షపాతం 868 మి.మీ కంటే తక్కువగా 820 మి.మీ వర్షపాతం నమోదైంది. 2023 ఎల్ నినో కన్నా ముందు వరసగా నాలుగేళ్లు సాధారణ వర్షపాతం నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినో పరిస్థితులుగా చెబుతుంటారు. దీని వల్ల భారత్‌లో బహీనమైన రుతుపవనాలు ఏర్పడుతాయి.