India invites Pakistan: ఏప్రిల్ నెలలో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశానికి పాకిస్తాన్ దేశాన్ని భారత్ ఆహ్వానించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరగాల్సిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వనం అందినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుకు కూడా భారత్ ఆహ్వానం పంపింది. ఖవాజా భారత్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు.
Read Also: Rishabh Pant : వేగంగా కోలుకుంటున్న రిషబ్.. స్విమ్మింగ్ పుల్ లో హల్ చల్
ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలను భారత్ తీసుకుంది. ఈ కూటమికి సంబంధించిన అన్ని సమావేశాలను భారత్ నిర్వహిస్తోంది. ఇందులో సభ్య దేశాలుగా ఉన్న అన్ని దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. ఇదిలా ఉంటే మేలో భారత్ ఎస్‌సీఓ సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి భారత్ ఆహ్వానం పంపింది. అంతకుముందు సభ్యదేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశాల కోసం భారత్, పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియల్ ను ఆహ్వానించింది. అయితే ఈ సమావేశానికి ఆయన హాజరుకాకుండా, పాక్ తరుపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ మునీబ్ అక్తర్ హాజరయ్యారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2001లో స్థాపించబడిన ఈ సంస్థలో 2017 బీజింగ్ సమావేశంలో భారత్, పాకిస్తాన్ లకు శాశ్వత సభ్యదేశాల హోదా కల్పించబడింది. గతేడాది ఎస్‌సీఓ సమావేశాలు ఉజ్బెకిస్తాన్ లోని సమర్ ఖండ్ లో జరిగాయి.