India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. దీనికి తగ్గట్లుగానే తాలిబన్లు రెండు దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్‌ని దాటి పాకిస్తాన్‌పై దాడులు చేశారు.
ఇదిలా ఉంటే, ఈ దాడులపై భారత్ స్పందించింది. ‘‘అమాయక పౌరులపై ఏదైనా దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాం’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ తన సొంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించే పాత పద్ధతని అవలంభిస్తోందని భారత్ చెప్పింది.
Read Also: Allu Arjun: పరామర్శకు అల్లు అర్జున్ వెళ్లొచ్చు.. కానీ?
ఆఫ్ఘన్ పౌరులపై పాకిస్తాన్ వైమానిక దాడులకు సంబంధించి మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు మరియు పిల్లలతో సహా ఆఫ్ఘన్ పౌరులపై వైమానిక దాడులపై మీడియా నివేదికలను గమనించాము, ఇందులో అనేక విలువైన ప్రాణాలు కోల్పోయారు. అమాయక పౌరులపై దాడులను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము’’ అని అన్నారు.
పాకిస్తాన్ తాలిబన్లకు, ఆఫ్ఘన్ పాలకులు సాయం చేస్తున్నారని పదే పదే పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తాలిబన్లు ఖండిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ సైనికులు, పోలీసులపై పాక్ తాలిబన్లు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 26 డిసెంబర్ 2024న, పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. 46 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. పాక్ చర్య అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించిందని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనయతుల్లా ఖౌరజ్మీ అన్నారు.