India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్‌తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.
ఇదిలా ఉంటే, రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు, తీవ్రవాదం పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి సహకరించుకోవాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్, కెనడాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని ఒక ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలపై సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. జీ-7 సమావేశంలో భాగంగా , భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం భారత్‌కు దౌత్య విజయంగా చెప్పవచ్చు. కెనడా భారత వ్యతిరేకతకు కేంద్రంగా మారుతోంది. పలువురు నేరస్తులు, ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం కీలకం మారింది. కెనడా నుంచి భారత్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని, మాఫియాను నడుపుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.
నిజ్జర్ హత్యతో దిగజారిన సంబంధాలు:
2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడావి అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా తిరస్కరించింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ఏర్పడింది. రెండు దేశాలు కూడా దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నాయి.