Tripura: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది. మృతులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. తక్షణ, నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు చేయాలని కోరింది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ముగ్గురు బంగ్లాదేశ్ వలసదారుల మరణాలకు ఢాకా నిరసన తెలిపింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యల్ని ‘‘హేయమైంది, ఆమోదయోగ్యం కానిది, మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన’’గా అభివర్ణించింది.
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీ ఏపీ పర్యటన విజయవంతం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు..
బంగ్లాదేశ్ కథనాన్ని భారత్ కొట్టిపారేసింది. ఈ సంఘటన భారత్ భూభాగంలో మూడు కిలోమీటర్ల దూరంలో జరిగిందని, ముగ్గురు కూడా బిద్యాబిల్ గ్రామం నుంచి పశువుల్ని దొంగిలించేందుకు ప్రయత్నించారని భారత్ విదేశాంగ శాఖ తెలిపింది. స్థానికులు వీరిని అడ్డుకున్నప్పుడు, పదునైన ఆయుధాలతో దాడి చేశారని, స్థానికులు తమను తాము రక్షించుకోవడానికి హత్య చేశారని తెలిపింది. అధికారులు వచ్చేసరికి ఇద్దరు కూడా చనిపోయారని, మూడో వ్యక్తి ఆస్పత్రిలో మరణించినట్లు వెల్లడించింది. ఇద్దరి మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించినట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.