Goa: బీచ్ షాక్స్‌లో ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు కూడా గోవాలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం అన్నారు. ఉత్తర గోవాలోని కలంగూట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాకు తక్కువ మంది విదేశాయులు వస్తే ప్రభుత్వాన్ని మాత్రమే నిందిచలేమని, అందరు వాటాదారులకు సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు. గోవా వాసులు తమ బీచ్ షాకులను ఇతర ప్రాంతాల వ్యాపారవేత్తలకు అద్దెకు ఇస్తున్నారని లోబో విచారం వ్యక్తం చేశారు.
బెంగళూర్ నుంచి కొంత మంది బీచ్ రెస్టారెంట్లలో ‘‘వడా పావ్’’ వడ్డిస్తున్నారు, మరికొందరు ‘‘ఇడ్లీ-సాంబార్’’ అమ్ముతున్నారు. అందుకే గత రెండేళ్లుగా రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటకులు తగ్గుతున్నారని చెప్పారు. అయితే, ఈ వంటకాలు ఎలా పర్యాటకాన్ని తగ్గిస్తున్నాయనే అంశాన్ని లోబో క్లియర్‌గా వివరించలేదు.
పర్యాటకులు తగ్గడం గోవాలో గందరగోళానికి దారి తీసిందని, దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ ఏడాది విదేశీ పర్యాటకులు గోవాలకు వస్తారు, కానీ ప్రస్తుతం మాత్రం ఆ సంఖ్య తగ్గిందని చెప్పారు. పర్యాటక శాఖ, టూరిజంతో సంబంధం ఉన్న అందరు వాటాదారులతో సమావేశం నిర్వహించి, విదేశీ పర్యాటకులు గోవాకు రావడానికి సిద్ధంగా లేకపోవడాన్ని అధ్యయనం చేయాలని కోరారు.
మరోవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా పర్యాటకులు తగ్గడానికి కారణమని లోబో చెప్పారు. క్యాబ్, ట్యాక్సీల దోపిడీ గురించి ఆయన మాట్లాడుతూ.. క్యాబ్ అగ్రిగేటర్లు, స్థానిక టూరిస్ట్ టాక్సీ ఆపరేటర్లు మధ్య తేడాలతో సహా కీలకమైన సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే, పర్యాటక రంగంలో చీకటి రోజుల్ని చూస్తామని హెచ్చరించారు.