Farooq Abdullah: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొగలుల చరిత్రకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలను తొలగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ విద్యను కాషాయీకరణం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. చరిత్రను చెరిపివేయలేరని శనివారం అన్నారు. షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్, బాబర్, హుమాయూన్, జహంగీర్‌లను ఎలా మర్చిపోతారు? వారు 800 ఏళ్ల పాలించారని చెప్పారు.
Read Also: CSK vs MI: విజృంభించిన సీఎస్కే బౌలర్లు.. చెన్నైకి స్వల్ప లక్ష్యం
మొఘలుల పాలనలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు ఎవరూ బెదిరింపులకు గురికాలేదని అన్నారు. తాజ్ మహల్ ను ఎప్పుడు కట్టారో అడిగితే ఏం చెబుతారు..? ఫతేపూర్ సిక్రీ గురించి ఏం చెబుతారు..? హుమాయున్ సమాధిని, ఎర్రకోటను ఎలా దాచిపెడతారు..? అని ప్రశ్నించారు. వారు గొడ్డలితో తమ పాదాలను తామే నరుక్కుంటున్నారని, మనం ఉండము కానీ చరిత్ర మిగిలిపోతుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు చైనా పేర్లు మార్చడం, చైనా గతంలో చేసిన వాదనను అంగీకరించడానికి భారత్ సిద్ధంగా లేదని అబ్దుల్లా అన్నారు.
ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా గెలవాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పొత్తు ఒక్కటే మనల్ని ఏకం చేసేది అని, మనం వ్యక్తిగతంగా పోరాడలేం అని అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావాలనే మార్గాలను అణ్వేషిస్తున్నామని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధించగలమని అనంత్ నాగ్ జిల్లాలో లార్నూలో విలేకరుల సమావేశంలో చెప్పారు.