Marriage fraud: ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిని అని, ఎన్ఐఏ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన వ్యక్తి మారుపేర్లు, వేషధారణతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల్ని మోసం చేస్తూ.. ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు, దీంతో పాటు ఇతనికి పాకిస్తాన్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
ప్రజలను మోసం చేస్తున్న 37 ఏళ్ల సయీద్ ఇషాన్ బుఖారీ అలియాస్ ఇషాన్ బుఖారీ అలియాస్ డాక్టర్ ఇషాన్ బుఖారీని ఒడిశా స్పెషల్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు ఒడిశాలోని జైపూర్ జిల్లాలోని నేయుల్ పూర్ గ్రామంలో నిన్న అరెస్ట్ చేశారు. అనేక నకిలీ గుర్తింపులు కలిగిన నిందితుడికి పాకిస్తాన్ లోని అనేక మంది వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, కేరళలో కొన్ని అనుమానాస్పదం కలిగి ఉన్నట్లు ఎస్టీఎఫ్ ఇన్పెక్టర్ జనరల్ జెఎన్ పంకజ్ తెలిపారు. అయితే పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
Read Also: NIA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు యువకులు.. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలు..
నిందితుడు అగ్రశ్రేణి ఐవీ లీగ్ కాలేజ్ అయిన కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్‌ని కలిగి ఉన్నట్లుగా నకిలీ పత్రానలు సృష్టించాడు. తనను డాక్టర్‌గా గుర్తించేందుకు కెనడియన్ హెల్త్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్, తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసుకున్నాడు. అంతర్జాతీయ డిగ్రీలు, అఫిడవిట్లు, బాండ్లు కలిగి ఉండీ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఎస్టీఎఫ్ జరిపిన సోదాల్లో 100కి పైగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కాశ్మీర్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మహిళల్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికీ అనేక మంది మహిళలతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఇతనికి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో సంబంధాలు ఉన్నాయని, దీనిపై మరింత దర్యాప్తు చేయాలని పోలీసులు చెప్పారు. అయితే పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉండే అవకాశం ఉందని, దీనిపై తాము ఎన్ఐఏతో టచ్ లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనేక ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో కూడా నిందితుడికి సంబంధం ఉంది. ఈ కేసుల్లో కాశ్మీర్ పోలీసులు ఇతని కోసం వేట సాగిస్తున్నారు.