Bihar: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్ జేడీయూ 85 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ‘‘మహాఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలే దక్కించుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
ఇదిలా ఉంటే, నవంబర్ 20న మరోసారి నితీష్ కుమార్ సీఎంగా బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కొలువదీరబోతోంది. మంత్రుల కూర్పుకు సంబంధించిన ఫార్ములా ఇప్పటికే సిద్ధమైంది. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపదనకు ఎన్డీయే మిత్రపక్షాలు ఓకే చెప్పాయి. మరోవైపు, ఏ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
అయితే, ‘‘హోం మినిస్ట్రీ’’పై బీజేపీ-జేడీయూల మధ్య చిక్కులు ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో శక్తివంతమైన హోంశాఖ నితీష్ కుమార్ వద్దే ఉండేది. దీనిని వదులుకునేందుకు జేడీయూ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలకు మధ్య ప్రధాన వివాదం ‘‘హోం శాఖ’’పై నెలకింది. జేడీయూ, బీజేపీలు స్పీకర్ పదవి గురించి కూడా పోటీ పడుతున్నాయి. బీజేపీ దీనిని నిలుపుకోవాలని అనుకుంటోంది. అయితే, స్పీకర్ పదవిపై మిత్రపక్షాల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. శాసనసభ్యుల అనర్హతపై అధికారం కారణంగా స్పీకర్ పదవి పాత్ర కీలకంగా ఉంది.
Read Also: Bihar Politics: ఆర్జేడీ ఘోర పరాజయం, ప్రతిపక్ష నేత పదవిని తిరస్కరించిన తేజస్వీ యాదవ్.!
మరోవైపు, ప్రమాణస్వీకారం కోసం పెద్ద ఎత్తున పాట్నాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాట్నాకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు బీజేపీ నేతలు కూడా రేపు రాత్రి సమయానికి పాట్నాకు చేరుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జేడీయూ నేతలు సంజయ్ ఝా, లలన్ సింగ్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. దాదాపుగా 3 గంటల పాటు క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం, బీహార్ ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ, జీతన్ రామ్ మాంఝీ హెచ్ఎఎం-ఎస్, ఆర్ఎల్ఎం ఉన్నాయి. బీజేపీ నుంచి 16 మంత్రులు, జేడీయూ నుంచి 14 మంది, ఎల్జేపీకి 6, హెచ్ఎఎం, ఆర్ఎల్‌ఎంకు చెరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జేడీయూల నుంచి ఐదారుగురు కొత్త ముఖాలు మంత్రి వర్గంలో కనిపించే అవకాశం ఉంది. జేడీయూ బీహార్ చీప్ ఉమేష్ సింగ్ కుష్వాహాకు క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.