Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ ఎంపీ, అస్సాం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఆయన విదేశీ శక్తుల చేత నాటబడిన ఒక పాకిస్తానీ ఏజెంట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలు అబద్ధమైతే, గొగోయ్ తనపై పరువునష్టం దాఖలు చేయాలని సవాల్ విసిరారు. ‘‘గొగోయ్ ఒక పాకిస్తాన్ ఏజెంట్, అతను పూర్తిగా అలాంటి వాడు. ఆయనను మనదేశంలో విదేశీ శక్తి నాటింది’’ అని విలేకరుల సమావేశంలో అన్నారు. గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత, గొగోయ్‌ను పాకిస్తాన్ ఏజెంట్‌గా నిరూపించే ఆధారాలను తాను వెల్లడిస్తానని ముఖ్యమంత్రి అన్నారు.
Read Also: Cyclone Montha Damage: తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..
దీనికి ముందు పలు సందర్భాల్లో హిమంత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్‌కి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని శర్మ ఆరోపించారు. గొగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. ఆయన పాకిస్తాన్ సానుభూతిపరుడు అని చెప్పారు. గొగోయ్ భారత అధికారులకు సమాచారం ఇవ్వకుండా 15 రోజులు పాకిస్తాన్‌లో ఉన్నారని, ఆయన భార్య భారతదేశంలో పనిచేస్తూ పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం తీసుకుంటుందని హిమంత ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని గొగోయ్ తోసిపుచ్చారు. తాను నిజంగా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే కేంద్రం ఎందుకు మౌనంగా ఉండని ప్రశ్నించారు.