దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అనుమతించలేదు. తాజాగా వచ్చే వారం నుంచి విచారిస్తామని వెల్లడించింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం అత్యంత వివాదాస్పదం అయింది. దేశ వ్యాప్తంగా ఈ అంశం రాజకీయ అస్త్రంగా మారింది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో మొదలైన ఈ వివాదం బెళగావి, శివమొగ్గ, చిక్ మంగళూర్, కొప్పెల, దక్షిణ కన్నడ, మాండ్యా జిల్లాలకు కూడా పాకింది.
ఈ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ అనే ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి కాదంటూ మార్చి నెలలో తీర్పు చెప్పింది. విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావడాన్ని తప్పుపట్టింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధంపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. జస్టిస్ రితూ రాజ్ అవస్తి, జస్టిస్ కృష్ట దీక్షిత్, జేఎం ఖాజీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.