కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.
Read Also: గూగుల్ క్రోమ్ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
అయితే ఈ అంశం రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి. విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతోంది. అయితే బీజేపీ మాత్రం హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తోంది. పాఠశాల ప్రాంగణాల్లో అంతా ఒక్కటేనని.. అందువల్ల విద్యార్థినులు హిజాబ్ వేసుకుని రాకూడదని స్పష్టం చేస్తోంది. బీజేపీకి మద్దతుగా కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీలకు వస్తుండటంతో ఈ వివాదం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హిజాబ్ వివాదంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యాఖ్యలు చేశారు. అయితే హిజాబ్ ధరించడం తన ప్రాథమిక హక్కు అని, దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.