Haryana: హర్యానాలో దారుణం జరిగింది. గోవుల స్మగ్లర్లుగా భావించి, గో సంరక్షకులు కారును వెంబడించి హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23న జరిగిన ఈ దాడిలో నిందితులను నిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్ మరియు సౌరభ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 12వ తరగతి విద్యార్థి ఆర్యన్ మిశ్రాను కాల్చి చంపారు. హర్యానా ఫరీదాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Read Also: Boeing Starliner: స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు.. అసలు భూమికి తిరిగి వస్తుందా..?
ఆర్యన్ మిశ్రా, అతని స్నేహితులు శాంకీ, హర్షిత్‌లను ఆవుల స్మగ్లర్లుగా తప్పుగా భావించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ఆర్యన్ మిశ్రా అతడి స్నేహితులు ప్రయాణిస్తున్న కారును దాదాపుగా 30 కిలోమీటర్లు వెంబడించి దారుణానికి ఒడిగట్టారు. రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో కొంతమంది పశువుల స్మగ్లర్లు నగరంలోకి వచ్చి పశువులను ఎత్తుకెళ్తున్నట్లు గో సంరక్షకులకు సమాచారం అందింది.
నిందితులు స్మగ్లర్ల కోసం వెతుకుతున్న సమయంలోనే నగరంలోని పటేల్ చౌక్ వద్ద డస్టర్ కారు కనిపించింది. దీంతో వారు కారు డ్రైవింగ్ చేస్తున్న హర్షిత్‌ని ఆపాలని కోరారు. అయితే, వారు ఆపకుండా కారుని నడిపారు. దీంతో నిందితులు ఐదుగురు వీరి కారుని వెంబడించారు. నిందితులు కారుపై కాల్పులు జరిపారు. ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఆర్యన్ మెడలో బుల్లెట్ దూసుకెళ్లింది. కారు ఆపిన సమయంలో మరోసారి కాల్పులు జరిపారు. నిందితులు కారులో ఇద్దరు మహిళల్ని చూసి, తాము తప్పుగా వ్యక్తిని కాల్చి చంపివేసినట్లు భావించి పారిపోయారు. ఆర్యన్‌ని ఆస్పత్రికి తరలించగా, ఒక రోజు తర్వాత అతను మరణించాడు.