హర్యానాలో దారుణం జరిగింది. అక్రమ మైనింగ్ ను అడ్డుకోబోయిన డీఎస్పీ అధికారిని లారీలో తొక్కించి చంపేసింది మైనింగ్ మాఫియా. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం హర్యానా నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారంతో డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ తన టీంతో కలిసి ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్గావ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఆపేందుకు ఉదయం 11 గంటలకు ఘటన స్థలానికి వెళ్లారు. అయితే పోలీసులు రావడాన్ని గుర్తించిన మైనింగ్ మాఫియా అక్కడి నుంచి పారిపోయారు.
అయితే ఇదే సమయంలో అక్కడ నుంచి లారీతో పాటు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా.. వారిని ఆపేందుకు లారీకి అడ్డుగా నిలబడ్డాడు. అయితే ఈ క్రమంలో లారీ ఆపకపోగా.. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పై నుంచి పోనిచ్చారు. దీంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీతో ఢీ కొట్టిన తరువాత నిందితుడు ఘటన స్థలం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మరణించిన డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కి హర్యానా పోలీసులు సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
Read Also: NIA Raids in Andhra Pradesh: ఏపీలో ఎన్‌ఐఏ సోదాల కలకలం.. ఏకకాలంలో 4 చోట్ల..!
ఈ ఘటనపై హర్యానా సర్కార్ సీరియస్ అయింది. హోం మంత్రి అనిల్ విజ్ నిందితులను విడిచిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హర్యానా రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యాపారం తీవ్రంగా ఉంది. 2021-22లో అసెంబ్లీకి సమర్పించిన ఓ రిపోర్టులో 2014-15 నుంచి 2021 వరకు ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రంలో 21,450 అక్రమ మైనింగ్ కేసులు గుర్తించారు. 2009లో ఆరావళి ప్రాంతంలో సుప్రీం కోర్టు మైనింగ్ నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయినా కూడా ఆరావళి ప్రాంతంలో మైనింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఆరావళి బచావో మూమెంట్ పేరుతో పౌర సంఘాలు ఈ ఏడాది గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఆరావళి ప్రాంతంలో కనీసం 16 చోట్ల అక్రమ మైనింగ్ సాగుతుందని ఆరోపించారు.