Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యాపారి ఉజ్జయిని నుంచి గోవాకు తన కుటుంబంతో కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారు గూగుల్ మ్యాప్ సహాయంతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే, వారు సరిగ్గా శిరోరి-హెమ్మడగా మధ్యలో దారి తప్పిపోయారు. మ్యాప్ సూచనలతో కారు నడుపుతుండగా.. అది నేరుగా అడవిలోకి తీసుకెళ్లింది. ఫోన్లకు సిగ్నల్స్ రాకపోవడంతో వారు రాత్రంతా కారులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
అయితే, మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ ఉన్న లొకేషన్‌ను కనుగొనడానికి దాదాపు 4 కిలో మీటర్ల మేర నడిచారు. ఆ తర్వాత వారు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి కాల్ చేయగా.. వెంటనే స్పందించి.. వారి లొకేషన్ ఆధారంగా ఖానాపుర పీఎస్ పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆ ఫ్యామిలిని రక్షించినట్లు ఇన్‌స్పెక్టర్ మంజునాథ నాయక్ పేర్కొన్నారు. అక్కడి నుంచి గోవాకు వెళ్లే మార్గాన్ని ఆ కుటుంబానికి పోలీసులు తెలిపారు. కాగా, గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడం వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కిందపడింది. దీంతో అందులో ప్రయాణించిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.