కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది.
మరోవైపు బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది. ఈ మేరకు భారత్‌లో 9.9 శాతం, రష్యాలో 6.1 శాతం, చైనాలో 6 శాతం, బ్రెజిల్‌లో 5 శాతం మాత్రమే వేతనాల పెంపు ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వే కోసం 40 వేర్వేరు రంగాల నుంచి 1500 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, లైఫ్ సైన్సెస్ రంగంలో వేతనాల పెంపు అధికంగా ఉండనున్నట్లు అయాన్స్ సంస్థ సర్వే తెలిపింది.