Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఆయన అరెస్టుపై ఇటీవల జర్మనీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయంపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అంతే ధీటుగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ జర్మనీని హెచ్చరించింది. జర్మనీ సీనియర్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత ఈ విషయంలో జర్మనీ తన స్వరాన్ని మార్చింది.
కేజ్రీవాల్‌పై నిష్పక్షపాత విచారణ జరగాలని భావిస్తున్నాము జర్మనీ చెప్పిన కొద్ది రోజుల తర్వాత దాని వైఖరిలో మార్పు వచ్చింది. భారత రాజ్యాంగపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నామని జర్మన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి బుధవారం చెప్పారు. ‘‘ భారత రాజ్యాంగం ప్రాథమిక మానవ విలువలు, స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. మేము ఈ ప్రజాస్వామ్య విలువలను ఆసియాలోని ముఖ్యమైన భాగస్వామి భారతదేశంతో పంచుకుంటాము’’ అని జర్మన్ అధికారి తెలిపారు. భారతదేశం, జర్మనీలు నమ్మకమైన వాతావరణంలో కలిసి పనిచేస్తాయన్నారు. ‘‘ఈ అంశంపై శనివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించాము. భారత్-జర్మనీ సన్నిహిత సహకారం, విశ్వాస వాతావరణంలో కలిసి ఉండటానికి గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాము’’ అని అన్నారు.
Read Also: Voting Rule: బూత్‌లో ఓటేయడానికి తిరస్కరిస్తున్న ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరు..
ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన తర్వాత.. జర్మనీ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి సెబాస్టియన్ ఫిషన్ శనివారం మాట్లాడుతూ.. ఈ అరెస్టును మేము గమనించామని, ఈ కేసులో ప్రజాస్వామ్య సూత్రాలను వర్తింపచేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులని, ఇందులో పరిమితులు లేకుండా అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించగలడని చెప్పాడు.
అయితే, భారత అంతర్గత విషయాల్లో ఇది కఠినమైన జోక్యమని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మన్ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్వీలర్కి సమన్లు జారీ చేసింది. మా న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడం, మా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా మీరు వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ‘‘భారత్ చట్టబద్ధమైన పాలనతో కూడిన శక్తివంతమైన, ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య ప్రపంచంలోని అన్ని చట్టపరమైన కేసుల్లో వలే ఈ కేసులో కూడా వ్యవహరిస్తాము.’’ అని చెప్పింది.