భారత రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. నవంబర్ 26న దేశమంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది నవంబర్ 26న సంవిధాన్ దివస్‌ను జరుపుకుంటుంది. ఇక ఇంత పెద్ద రాజ్యాంగాన్ని చాలా భద్రంగా కాపాడుతుంటారు. ఇందుకోసం నైట్రోజన్ గ్యాస్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడుంది? ఎలా భద్రపరుస్తారో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!
చేతితో రాసిన తొలి రాజ్యాంగ ప్రతులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. చెక్కు చెదురకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లిఖిత ప్రతులు పార్లమెంట్‌లోని అత్యాధునిక నైట్రోజన్ చాంబర్‌లో భద్రపరిచారు. మొదట్లో ఒరిజనల్ కాపీలను ఫ్లాన్నెల్ వస్త్రంలో చుట్టి నాఫ్తీలీన్ బంతులతో కాపాడేవారు. అయితే కాలక్రమంలో ప్రతులు దెబ్బతినే పరిస్థితులు తలెత్తే అవకాశం రావడంతో 1994లో అమెరికా పద్ధతులను అనుసరించి ప్రయోగశాల ఏర్పాటు చేశారు. గెట్టి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా సహకారంతో పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ చాంబర్‌లో రాజ్యాంగాన్ని భద్రపరుస్తున్నారు.
గ్యాస్ చాంబర్ ఎందుకు?
గ్యాస్ చాంబర్‌లోనే ఎందుకు భద్రపరుస్తున్నారంటే.. రాజ్యాంగం నల్ల సిరాతో రాయబడింది. ఇది కాలక్రమేణా ఆక్సీకరణం చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రతులు పాడవ్వకుండా ఉండేందుకు గ్యాస్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. గదిలో క్యూబిక్ మీటర్‌కు 50 గ్రాముల తేమను ఇస్తుంది. నత్రజనితో నిండి ఉంటుండి. ఏ మాత్రం గాలి చొరబడకుండా డిస్‌ప్లే ఉంటుంది. 1 శాతం కంటే తక్కువగానే ఆక్సిజన్ ఉంటుంది. మాన్యుస్క్రిప్ట్‌లను(చేతి రాత ప్రతులు) ఆక్సీకరణ, సూర్యకాంతి, సూక్ష్మజీవులు, వాయు కాలుష్యం నుంచి పూర్తిగా రక్షిస్తుంది. ఇక మానిటర్లు పర్యావరణాన్ని నియంత్రిస్తుంటాయి. ఇక ప్రతి ఏటా వాయువును పునరుద్ధరిస్తూ ఉంటారు. అంతేకాకుండా సీసీటీవీ నిఘాలో ప్రతి రెండు నెలలకు ఒకసారి గదిని తనిఖీ చేస్తూ ఉంటారు.
అసలు రాజ్యాంగంలో..
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో ఒక ప్రవేశిక, 448 వ్యాపాలు, 12 షెడ్యూల్‌లు, 5 అనుబంధాలు, 115 సవరణలు ఉన్నాయి. రాజ్యాంగ సభలోని ప్రతి సభ్యుడు చేతితో రాసిన కాపీలపై సంతకం చేశారు. ఒకటి హిందీలో.. మరొకటి ఆంగ్లంలో ఉన్న ప్రతులపై సంతకం చేశారు. ఇక మాన్యుస్క్రిప్ట్‌లను డెహ్రాడూన్‌లోని సర్వే ఆఫ్ ఇండియా ఫోటోలిథోగ్రాఫ్ చేసింది. బియోహర్ రామ్‌మనోహర్ సిన్హా, నందలాల్ బోస్‌తో సహా శాంతినికేతన్ కళాకారులు పేజీలను అలంకరించారు, వాటిని ప్రత్యేకమైన కళాఖండాలుగా మార్చారు.
ఇది కూడా చదవండి: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన