France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఐదేళ్ల షార్ట్ టర్మ్ షెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను రూపొందించింది. ఇరు దేశాధినేతలు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ అందించే ప్రత్యేక కార్యక్రమం ‘ ఇంటర్నెషనల్ క్లాసెస్’లను ఫ్రాన్స్ ఏర్పాటు చేస్తుందని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తెలిపింది.
Read Also: Male Fertility: పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరిచే 5 విషయాలు
ప్రెసిడెంట్ మక్రాన్, పీఎం మోడీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు మా టీంలు రెట్టింపు పనిచేస్తున్నాయని, ఫ్రాన్స్ ఎల్లప్పుడూ మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్న విభిన్న దేశం అని, ఫ్రాన్స్ ఎల్లప్పుడు భారత్ స్నేహితుడిగా ఉంటుందని భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ అన్నారు.
ఫ్రెంచ్ రాయబార కార్యాలయం అక్టోబర్ నెలలో చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ కూడా నిర్వహించనుంది. 40కి పైగా ఫ్రెంచ్ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన కోర్సును ఎంచుకునేలా ఈ ఫెయిర్ పాల్గొననున్నట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.