Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి వైదొలిగిన కొద్ధి సేపటికే కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బెంగళూర్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్దరామయ్యతో శెట్టర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలను కలిసేందుకు హుబ్బళ్లి నుంచి బెంగళూర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు.
ఎలాంటి డిమాండ్లు లేకుండా, కేవలం పార్టీ సిద్ధాంతాలు నచ్చే జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. దేశాన్ని కలిపి ఉంచేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పార్టీని కాదని షెట్టర్ తన లాభాన్ని చూసుకోవడానికి బయటకు వెళ్లారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్ప ఆరోపించారు. పార్టీ ఢిల్లీలో కీలక పదవులు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని ఆయన అన్నారు. హోం మంత్రి అమిత్ షా జగదీష్ షెట్టర్ తో వ్యక్తిగతంగా మాట్లాడారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. లింగాయత్ వర్గానికి అత్యధికం మంత్రి పదువులు ఇచ్చింది బీజేపీ అని బొమ్మై అన్నారు.
లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్ సవాది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బందిగా మారాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు ప్రకటించనున్నారు.