Congress: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారిలో జీఎం సరూరి, హాజీ అబ్దుల్ రషీద్, మహమ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, చౌదరి మహమ్మద్ అక్రమ్ ఉన్నారు. తామంతా గులాం నబీ ఆజాద్‌కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు ఉదయం రాజీనామా చేశారు. పార్టీ తీరుపై గత కొంత కాలంగా ఆజాద్ అసంతృప్తిగా ఉంటున్నారు. ఇటీవల కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. అయితే ఈ నియామకం జరిగిన కొద్ది సేపటికే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు.జమ్మూ కాశ్మీర్ లో మంచి పట్టు ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. 1973లో జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ మెంబర్‌గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2005-08 మధ్య ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా పనిచేశారు.
ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్‌లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడించారు. చిన్నపిల్లాడి మనస్తత్వంతో వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని చిన్నచూపు చూసినట్లు విమర్శించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓటమి చెందడానికి అది ప్రధాన కారణమైనట్లు ఆజాద్ ఆరోపించారు. 2014 నుంచి రెండు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినట్లు గులాం నబీ ఆజాద్ అన్నారు. చాలా అవమానకర రీతి ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. 2014 నుంచి 2022 వరకు జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎన్నికల్లో ఓడిపోయినట్లు ఆజాద్ తెలిపారు.