అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళ పైన పులి దాడి చేసింది.
పెద్దపులి దాడిలో రాధ మరణించింది. రాధ మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసింది. పులి మనుషులను చంపి తింటుండడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పులి నుంచి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది. మనుషులను చంపి తింటున్న పులిని చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మ్యాన్ ఈటర్ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని గుర్తించినట్లు తెలిపారు. కళేబరంపై గాయాలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మెడపై లోతైన గాయాలు ఉండడంతో పోస్టుమార్టం అనంతరం పులి మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకరియా వెల్లడించారు. మ్యాన్ ఈటర్ మృతి చెందడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.