వర్షాకాలం వచ్చింది అంటే దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తుంటాయి. దీనికి కారణం దోమలు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే వైరస్‌లకు వాహకాలుగా ఉంటాయి. దోమల నివారణ కోసం వర్షాకాలంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పడుకునే తప్పనిసరిగా నిండుగా కప్పుకొని నిద్రపోవాలి. తెల్లవారుజామున ఆడ అనోఫిలిస్ దోమ కాటు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆడ అనోఫిలిస్ దోమ కుట్టడం వలన దాని లాలాజలం ద్వారా మలేరియా పరాన్నజీవి మనిషి రక్తంలోకి ప్రవేశిస్తుంది. మలేరియా పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించిన 18 రోజులకు వృద్దిచెంది శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవి కారణంగా జ్వరం, తలనొప్పి, చలి, అలసట వంటివి కనిపిస్తాయి. మలేరియా జ్వరం తీవ్రత పెరిగితే దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ప్రతి ఏడాది ప్రపంచంలో పది కోట్లకు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయని, నాలుగు లక్షల మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. దోమలను నివారణ కోసం చర్యలు తీసుకోవడానికి ప్రతి ఏడాది ఆగస్టు 20 వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.