Olive Ridley Turtles: అంతరించిపోతున్న అరుదైన ‘‘ఆలీవ్ రిడ్లీ’’ తాబేళ్లు కనిపించాయి. 33 ఏళ్ల తర్వాత ఒడిశాలోని బీచ్‌కి వచ్చాయి. సామూహిక గూడు కోసం ఒడిశాలోని గహిర్మాత సముద్ర అభయారణ్యంలోని ఎకాకులనాసి ద్వీపంలో కనిపించినట్లు ఒక అధికారి తెలిపారు. ‘‘ ఈ ద్వీపంలోని అందమైన బీచ్ సముద్ర కోతకు గురైంది. దీని ఫలితంగా బీచ్ ప్రొఫైల్ తగ్గింది. అయితే, 2020 నుంచి బీచ్ మళ్లీ స్థిరీకరణకు గురైంది. దీంతో బీచ్ ప్రస్తుతం పొడవుగా మారింది. ఇది తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనుకూలంగా మారింది’’ అని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మానస్ దాస్ అన్నారు. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు చివరిసారిగా 1992లో ఈ బీచ్‌లో కనిపించాయని, ఇప్పుడు 3 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చాయిన దాస్ అన్నారు.
Read Also: IND vs NZ Finals: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ చేయనున్న భారత్
ఇటీవల కాలంలో ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తాబేళ్ల సంరక్షణకు చాలా చర్యలు తీసుకుంది. గతంలో 4 కి.మీ పొడవనున్న ఏకాకులనాసి బీచ్, ఇప్పుడు సహజ అక్రెషన్ ప్రక్రియ తర్వాత 8 కి.మీ కు విస్తరించింది. గత రెండు రోజుల్లో 1.7 లక్షల తాబేళ్లకు ఈ బీచ్ ఆతిథ్యం ఇచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. నాసి-2 బీచ్ కాకుండా, ఈ బీచ్ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశంగా మారింది. నాసి-2 బీచ్‌లో 2.63 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి గుంతలు తవ్వాయి.
ఒడిశా తీరం వెంబడి ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతీ ఏడాది గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి. కేంద్రపారా జిల్లాలోని గహిర్మాత బీచ్ ఈ తాబేళ్లకు ప్రపంచంలోనే ఆతిథ్యం ఇచ్చే అతిపెద్ద బీచ్‌గా పేరు సంపాదించుకుంది. గహిర్మాత కాకుండా, ఈ తాబేళ్లు రుషికుల్య నది ముఖద్వారా, దేవీ నది ముఖద్వారం వద్ద సామూహిక గూడు కట్టుకోవడానికి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత, తాబేళ్లు సముద్ర జలాల్లోకి వెళ్తుంటాయి. 45-50 రోజుల తర్వాత ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి.