Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భద్రతా బలగాలు. వరసగా మూడో రోజు కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.
Read Also: Viral Video: రష్యా ప్రతినిధిని కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ.. వీడియో వైరల్..
వరసగా బుధవారం నుంచి కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్ మూడోది. రాజౌరీ జిల్లాలోని కంది కుగ్రామంలోని కేసరి ప్రాంతంలో తాజా సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. దీంతో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతాబలగాలపైకి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
అంతకుముందు గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను స్థానికులుగా గుర్తించారు. వీరిద్దరు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నారు. షోఫియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ గా గుర్తించారు. 2023లో ఇద్దరూ ఉగ్రవాదంలోకి చేరారు. బుధవారం కుప్వారాలోని పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం, కాశ్మీర్ పోలీసులు హతమార్చారు.