Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ రేపు చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో కేజ్రీవాల్‌ని నిందితుడిగా చేర్చడం ఇదే తొలిసారి. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. చార్జిషీట్‌లో లిక్కర్ పాలసీ కేసులు కేజ్రీవాల్ ‘‘కింగ్ పిన్’’, మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది.
Read Also: Sujana Chowdary: చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ల కిరీటమే..! అన్నీ ఓవర్ నైట్ చేయలేం..
బుధవారం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. శుక్రవారం ఈడీ నివేదికను సమర్పించాలని ఈడీ తరుపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు చెప్పింది. ‘‘మేము మధ్యంతర ఉత్తర్వులను (మధ్యంతర బెయిల్‌పై) శుక్రవారం ప్రకటిస్తాము. అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌పై కూడా అదే రోజు నిర్ణయం తీసుకుంటాము’’ అని జస్టిస్ ఖన్నా అన్నారు.
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ని మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఒక వేళ విడుదలైతే తన అధికార విధులకు దూరంగా ఉండాలని ఇటీవల ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు మొత్తానికి కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే, ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆప్ పేర్కొంటోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కావాలనే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినట్లు ఆరోపిస్తోంది.