Earthquake Of Magnitude 3.6 Hits Near Maharashtra’s Nashik: దేశంలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోనే వచ్చే భూకంపాలు.. తాజాగా మహారాష్ట్రను తాకింది. నాసిక్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. నాసిక్ కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ఉపరితం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక కనిపించింది. దీంతోనే భూకంపం వచ్చింది. భూమికి దిగువన 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అంతకుముందు కూడా మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో కూడా భూకంపాలు సంభవించాయి. కొన్ని వారాల క్రితం గడ్చిరోలి జిల్లా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనలు సమీపంలోని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కనిపించాయి.
Read Also: Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో నేపాల్ దేశంలో భారీ భూకంపాలు వచ్చాయి. వీటి ధాటికి ఉత్తరాఖండ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. హిమాలయాల్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతోనే తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. భూ ఉపరితం కింద ఉన్న ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతోంది. ఇండియన్ , యూరేషియా టెక్టానిక్ ప్లేట్ పరస్పరం ఘర్షణకు గురవుతున్నాయి. దీని కారణంగా ఉద్భవించే శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది.