యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయిల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక, ఇజ్రాయిల్ పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి.
యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్లు, యుద్ధ విమానాలు చేయాల్సిన పనిని డ్రోన్లు చక్కబెట్టేస్తున్నాయి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించేస్తున్నాయి. పైగా, ఖర్చు తక్కువ. దీంతో యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధంలో శత్రువు పైచేయి సాధించడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుతూ ఉండాలి. మన బలం ఎంత, ప్రత్యర్థి బలహీనత ఏమిటి అన్న దానిని బట్టి వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. జయాపజయాలు అనేవి పటిష్టమైన వ్యూహం పైనే ఆధారపడి ఉంటాయి. శత్రువు దగ్గర విషయం ఉంటే మన దగ్గర దానికి విరుగుడు ఉండాల్సిందే. ఇప్పుడు కథన రంగంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాల్సి ఉంటుంది కనుక డ్రోన్లకు డ్రోన్లతోనే సమాధానం ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది.
Also Read:HHVM Trailer : హరిహర.. వీరమల్లు విధ్వంసం మామాలులుగా లేదు
ఉక్రైన్-రష్యా మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతోంది. మొదట్లో రష్యా వైమానిక దాడులు చేసింది, మిసైళ్ళతో విరుచుకుపడింది. అయితే, ఆరంభంలో రష్యాకు దీటుగా బదులివ్వలేకపోయింది ఉక్రైన్. కానీ, డ్రోన్ల ఎంట్రీతో యుద్ధం స్వరూపం మారిపోయింది. తొలుత మానవరహిత డ్రోన్లతో రష్యా యుద్ధనౌకలని టార్గెట్ చేసింది ఉక్రైన్. దీంతో, రోజులు, వారాల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం మూడేళ్ళయినా కొలిక్కిరాని పరిస్థితి నెలకుంది. ఉక్రైన్ పై రష్యా పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించలేని పరిస్థితికి దారి తీసింది.
2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్కవాను ముంచేసింది ఉక్రైన్. మోస్కవా యుద్ధనౌక బ్లాక్ సీ ఫ్లీట్ కు ఫ్లాగ్‌షిప్. దీనిపై మిసైళ్లతో పాటు నావెల్ డ్రోన్లతో విరుచుకు పడింది ఉక్రైన్. ఆ దాడి సక్సెస్ కావడంతో నావెల్ డ్రోన్లతో మరిన్ని దాడులు చేస్తూ వచ్చింది ఉక్రైన్. ఈ క్రమంలోనే ల్యాండింగ్ క్రాఫ్ట్ సీజర్ కునికోవ్‌తో పాటు సెర్జి కోటో యుద్ధ నౌకను ముంచేసింది. అలాగే, యుద్ధ నౌకలు టెసీజర్ కునికోవ్, క్వారెటి యువానోవెట్స్ గస్తీ నౌక వసిలి బైకోవ్, మరో ల్యాండింగ్ షిప్ నోవ చర్క్స్ తో పాటు బీ237 సబ్ మెరైన్ను ఉక్రైన్ ముంచేసింది. నల్ల సముద్రంలో రష్యా మూడింట ఒకవంతు నౌకలను కోల్పోయింది. ఆయుధ సంపత్తి పరంగా రష్యాతో ఉక్రైన్ కు ఏమాత్రం పోలిక లేదు. రష్యా నేవీని ఉక్రైన్ ఆ స్థాయిలో దెబ్బ తీయగలిగిందంటే, నావెల్ డ్రోన్లతోనే సాధ్యమైంది. అయితే, నల్ల సముద్రంలో చావు దెబ్బ తిన్నాక రష్యా అప్రమత్తమైంది. ఉక్రైన్ నావెల్ డ్రోన్లకు అడ్డుకట్ట వేసే వ్యూహాలను సిద్ధం చేసింది. మరింత నష్టం జరగకుండా నిలువరించుకోగలిగింది.
రష్యా నేవీని డ్రోన్లతో దెబ్బతీసిన ఉక్రైన్, అదే వ్యూహాన్ని కొనసాగించింది. రష్యాలోని పలు లక్ష్యాలపై డ్రోన్లను ప్రయోగించింది. అయితే, స్వల్ప సంఖ్యలో ఆ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా రష్యా కూడా డ్రోన్లను రంగంలోకి దించింది. అయితే, రాను రాను యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైల్ కంటే డ్రోన్లతోనే రష్యా, ఉక్రైన్ దాడులు చేసుకుంటున్నాయి. జూన్ 1న ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రైన్ చేసిన డ్రోన్ల దాడి రష్యాను షాక్ కు గురిచేసింది. రష్యాలోకి బాగా చొచ్చుకు వెళ్లి ఈ దాడిని చేసింది ఉక్రైన్. ఇందులో రిమోట్ కంట్రోల్ తో పనిచేసే 117 డ్రోన్లను వినియోగించింది. కంటైనర్ వాహనాలతో డ్రోన్లను పంపించి రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై మెరుపు దాడులను చేయించడంలో ఉక్రైన్ సక్సెస్ అయింది.
ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడులతో రష్యాకు భారీగా నష్టం కలిగింది. 40 కు పైగా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అందులో ట్యూ-95, ట్యూ-160 తో పాటు వ్యూహాత్మక బాంబర్లు ఉన్నాయి. అలాగే, గగనతల దాడుల్ని ముందుగానే పసిగట్టే A-50 విమానం కూడా ధ్వంసమైంది. కేవలం ఒక్క దాడితో 7 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఆయుధాలు ధ్వంసం చేయగలిగింది ఉక్రైన్. డ్రోన్లతో ఎంతటి విధ్వంసం సృష్టించొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
Also Read:CM Chandrababu: రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది.. ఎప్పుడైనా వైసీపీ కొనిందా?
ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా రష్యా కూడా డ్రోన్ దాడులు ముమ్మరం చేసింది. ఉక్రైన్ లోని లక్ష్యాలపై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. గత జూన్లో ఉక్రైన్ పై 5438 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రైన్ నగరాలపై భీకర దాడులు చేసింది. తాజాగా, ఇజవస్‌లోని ఓ ఫ్యాక్టరీ పై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన అమెరికాకు చెందిన F-16 కూడా డ్రోన్ల ముందు దిగదుడుపుగా మారింది. జూన్ 28న అర్ధరాత్రి సమయంలో ఉక్రైన్ పై డ్రోన్లు, మిసైళ్ళతో విరుచుకు పడింది రష్యా. ఒకేసారి 500 డ్రోన్లను ప్రయోగించింది. అయితే, 477 డ్రోన్లతో పాటు 60 మిసైళ్ళను ఉక్రైన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిలువరించగలిగాయి. 249 డ్రోన్లను కూల్చివేయగా, 228 డ్రోన్లను ఎలక్ట్రానిక్ జామిన్ ద్వారా నిర్వీర్యం చేయగలిగింది. అయితే, ఈ దాడిలో ఉక్రైన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా డ్రోన్ కూల్చివేసింది. ఈ ఘటనలో F-16 పైలట్ కూడా చనిపోయాడు.
రష్యాను దీటుగా ఎదుర్కోవడానికి ఉక్రైన్ సిద్ధమవుతుంది. భారీ స్థాయిలో డ్రోన్ తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. అలాగే, రష్యాను దెబ్బ తీసేందుకు ఉక్రైన్ దీర్ఘ శ్రేణి డ్రోన్లను వినియోగిస్తోంది. రష్యాలోని కీలక పరిశ్రమలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాలు, వాహనాలు వంటి మౌలిక వసతుల కేంద్రాలను టార్గెట్ చేస్తోంది ఉక్రైన్. అంతేకాదు, రష్యాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తోంది ఉక్రైన్.
మొత్తానికి ఉక్రైన్ జరిపిన ఆపరేషన్ స్పైడర్ వెబ్, దానికి ప్రతీకారంగా రష్యా జరుపుతున్న డ్రోన్ దాడులను బట్టి చూస్తుంటే యుద్ధం స్వరూపం మారిపోయిందని స్పష్టమవుతుంది. మున్ముందు కథన రంగాన్ని డ్రోన్లు ఏలబోతున్నాయంటే అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంతకీ, యుద్ధభూమిలో ఇప్పుడు డ్రోన్లకు ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అత్యాధునిక యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైల్లను పక్కన పెట్టి అందరూ డ్రోన్ల వెంట ఎందుకు పడుతున్నారు? ఇంతకీ, డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎందుకు పూర్తి స్థాయిలో నిలువరించలేకపోతున్నాయి?
Also Read:Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్.. వారికి కూడా!
యుద్ధంలో పైచేయి సాధించాలంటే శత్రువును చావు దెబ్బ తీయాలి. శత్రువు బలమైన వాడైతే యుక్తితో ఆ పని చేయాలి. రష్యాతో యుద్ధంలో ఉక్రైన్ అదే చేసింది. అగ్రరాజ్యమైన రష్యాను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుందంటే అది డ్రోన్లతోనే సాధ్యమవుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతున్న డ్రోన్లు తయారీకయ్యే ఖర్చు తక్కువే. ఒక యుద్ధ విమానం తయారీకయ్యే ఖర్చులో వెయ్యో వంతు కూడా దీనికి కాదు. అలాగే, యుద్ధ విమానాలను నడిపేందుకు పైలట్లు కావాలి. వాళ్ళ శిక్షణకు చాలా ఖర్చు అవుతుంది. నైపుణ్యం సాధించడానికి చాలా సమయం పడుతుంది. డ్రోన్ల విషయానికి వస్తే ఈ రెండు ఉండవు. అంతేకాదు, టార్గెట్ ఫిక్స్ చేసి పంపిస్తే చాలు, మిగతాది డ్రోన్ చూసుకుంటుంది. జీపీఎస్ టెక్నాలజీ సాయంతో ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
డ్రోన్లు దిగుమతి చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్వయంగా తయారు చేసుకోవాలన్నా దానికి పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు అక్కర్లేదు. తయారు చేసే వాళ్ళు కూడా ఏరోనాటిక్స్‌లో నిపుణులు కానక్కర్లేదు. విడి భాగాలను అసెంబ్లింగ్ చేయడం ద్వారా డ్రోన్లను సిద్ధం చేయొచ్చు. అంటే అతి తక్కువ ఖర్చుతో కావాల్సినన్ని డ్రోన్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది.
డ్రోన్లకు ఆయుధాలను అమర్చడం కూడా చాలా సులభం. అందుబాటులో ఉన్న ఆయుధానికి తగ్గట్లుగా 3డీ ప్రింటెడ్ వంటి టెక్నాలజీతో డ్రోన్లకు లాంచర్లను అమర్చే వీలుంది. దీంతో, డ్రోన్లకు ఆయుధాలను అమర్చి ఒకేసారి పెద్ద సంఖ్యలో శత్రు లక్ష్యాలపైకి ప్రయోగిస్తున్నారు. ఇది గగనతల రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది. చిన్నవి, చౌకైన ఎఫ్‌పీవీ డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఉపయోగించి రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలను ఉక్రైన్ ధ్వంసం చేస్తోంది. అంటే, లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే ఆయుధాలను కేవలం కొన్ని వేల రూపాయలు విలువ చేసే డ్రోన్లు ధ్వంసం చేస్తున్నాయి. అంటే ప్రత్యర్థికి తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాదు, శత్రు సైనికులపై బాంబులు జారవిడుస్తున్నాయి డ్రోన్లు. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.
డ్రోన్లు, క్షిపణులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి. క్షిపణుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలుగుతున్నాయి డ్రోన్లు. మెరుపుదాడి సమయంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్‌లను ధ్వంసం చేయడానికి డ్రోన్లను వినియోగించింది హమాస్. ఇటీవల ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఇరాన్ పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, వాటిని నిలువరించడానికి ఇజ్రాయిల్ గనతల రక్షణ వ్యవస్థలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికీ కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకొని వచ్చి విధ్వంసం సృష్టించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్, పాకిస్తాన్ డ్రోన్లను వినియోగించాయి. పాక్ డ్రోన్లు మన జనావాసాలపై పడడం వల్ల ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. టర్కీ అందజేసిన డ్రోన్లతో మనపై పాకిస్తాన్ దాడులు చేసింది. పాక్ దాడులకు సమాధానంగా మనం కూడా డ్రోన్లను వినియోగించాం.
డ్రోన్లను నిలువరించే వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సాధారణ గగనతల వ్యవస్థలను డ్రోన్ల కోసం వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో, సిగ్నల్ జామింగ్ వంటి పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలు ఉన్నాయి. కానీ, ఆ వ్యవస్థలని దాటుకుని ముందుకు వెళ్లేలా కొత్త డ్రోన్లు సిద్ధమవుతున్నాయి. దీంతో, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తరహాలో డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఏఆర్2 విక్టర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే, తొమ్మిది డ్రోన్లను కూల్చినా, 10వ డ్రోన్ చేయాల్సిన నష్టాలను చేసేస్తుంది.
యుద్ధ క్షేత్రం అంటేనే సరికొత్త ఆయుధాలకు ప్రయోగశాల. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే, క్షిపణులకు వీటిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి పలు దేశాలు. ఒక్కో సందర్భంలో ప్రత్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా డ్రోన్లలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. పోతే ఓ డ్రోన్ పోతుంది, సక్సెస్ అయితే ప్రత్యర్థికి భారీ నష్టం జరుగుతుంది. ఇది డ్రోన్ల వినియోగం వెనక గల వ్యూహం.
టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే సరి, లేదంటే దానివల్ల ఇబ్బందులు తప్పవు. డ్రోన్లు కూడా అటువంటివే. ఇప్పటికే ఫుడ్ డోర్ డెలివరీ చేస్తున్నాయి. రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్‌లో సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఐరన్ మ్యాన్ లాంటి రోబోలు, ఎయిర్ ట్యాక్సీలు వంటివి అందుబాటులోకి రాబోతున్నాయి. ఆధునిక టెక్నాలజీని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం అన్న దానిపై ఉంటుంది దాని ఫలితం.
ప్రస్తుతం యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్లు ఇతర రంగాల్లోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. పైలట్ తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే డ్రోన్లను ఆరంభంలో సైనిక అవసరాల కోసం వినియోగించారు. అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్ ఈ కోవకు చెందినది. డేగలా ఆకాశంలో ఎగురుతూ నిర్దిష్ట ప్రాంతంపై నిఘా పెట్టడం, అవసరమైన మిసైళ్ళను ప్రయోగించి లక్ష్యాలను ధ్వంసం చేయడంలో ప్రిడేటర్ డ్రోన్లకు తిరుగులేదు. గగన గస్తీ కోసం కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే, ఆ డ్రోన్లు చాలా ఖరీదైనవి కనుక కేవలం రక్షణ కార్యకలాపాలకే అవి పరిమితమవుతున్నాయి.
కానీ, కారు చౌకగా తయారయ్యే డ్రోన్ల వినియోగం విభిన్న రంగాల్లో విస్తృతమవుతోంది. వ్యవసాయం దగ్గర నుంచి రెస్క్యూ ఆపరేషన్ వరకు వాటిని వాడుతున్నారు. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చైనాలో డ్రోన్‌ను వినియోగించారు. అంటే, రెస్క్యూ హెలికాప్టర్ చేసే పనిని ఒక డ్రోన్ చక్కబెట్టింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే హెలికాప్టర్ ని వినియోగించాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. హెలికాప్టర్ ఉంటే సరిపోదు, సుశిక్షితుడైన పైలట్ కూడా ఉండాలి. కానీ, రిమోట్ కంట్రోల్ తో పనిచేసే డ్రోన్ సాయంతో మనిషిని రక్షించగలిగారు.
మెరుపు వరదలు వచ్చే ప్రాంతాల్లో ఇటువంటి డ్రోన్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో స్పందించేలా డ్రోన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. భవనంలోని నిర్దిష్ట ప్రదేశాల్లో ఉండే డ్రోన్లు, అగ్ని ప్రమాదం జరగగానే మంటలున్న ప్రదేశానికి చేరుకొని అగ్నికీలల్ని అదుపు చేస్తాయి. ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాల్లో సైతం డ్రోన్లను అమర్చుతున్నారు. దీనివల్ల అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఉండదు. పైగా, మంటల్ని పక్కాగా అదుపు చేసే అవకాశం ఉంటుంది.
Also Read:Rainy Season Laundry Tips: వర్షాకాలంలో తడి బట్టల దుర్వాసన ఎలా పోగొట్టాలి? ఈ సింపుల్ చిట్కాలు మీకోసం!
రైతులకు కూడా డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. పురుగుల మందు పిచికారి చేయడం వంటి పనులకు ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు చేపలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి కూడా డ్రోన్లు సహకరిస్తున్నాయి. పర్యాటక, వినోద రంగాల్లో కూడా డ్రోన్ల వినియోగం విస్తృతమైంది. డ్రోన్లతో చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. త్వరలో పైలట్ రహిత ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు సైతం అందుబాటులోకి రాబోతున్నాయి. ఐరన్ మ్యాన్ తరహాలో గాలిలో ఎగురుతూ మనకు అవసరమైన సేవలు అందించే హ్యూమనాయిడ్ డ్రోబోలు సైతం అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. దీనికి సంబంధించి ఇటలీ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.
విభిన్న రంగాల్లో డ్రోన్ల సేవలు విస్తృతం కానున్న ప్రస్తుతానికి మాత్రం యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, డ్రోన్లతో పొంచి ఉన్న ముప్పులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, డ్రోన్లను నిలువరించే వ్యవస్థలని అభివృద్ధి చేయడంలోనూ ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. భారత్ సైతం డ్రోన్ షీల్డ్ సిస్టమ్‌ను సిద్ధం చేసింది. మొత్తానికి డ్రోన్లు యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. అయితే, వాటిని విధ్వంసం కోసం కాకుండా మన అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.