PM Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించారు. మరోసారి ప్రతిపక్ష ఇండియా కూటమిని, వంశపారంపర్య రాజకీయాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమి వారి సొంత కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, తాము మాత్రం దేశం యొక్క తరువాతి తరాల మంచి భవిష్యత్తు నిర్మించడానికి పనిచేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ప్రస్తావిస్తూ.. ‘‘మాకు పిల్లలు లేరు, మీ పిల్లల కోసం పనిచేస్తున్నాం’’ అని అన్నారు. మూలాయం సింగ్ యాదవ్ సొంత జిల్లాలో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. రాబోయే 1000 ఏళ్ల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా ఉండేలా తాను పునాది వేస్తున్నానని ప్రధాని చెప్పారు.
మోడీ ఉన్నా లేకపోయినా దేశం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ ఎస్పీ-కాంగ్రెస్ ప్రజలకు ఏం చేశాయి..? వారు తమ భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోరాడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ కుటుంబాలు, ఓటు బ్యాంకులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్పీ, కాంగ్రెస్ నినాదాలన్నీ అబద్ధాలేనని, ఇప్పుడు వారు మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి అసత్యాలు వ్యాప్తి చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి.
Read Also: Anna Rambabu: ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలి.. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి
కొందరు మెయిన్‌పురి, కన్నౌజ్, ఇటావాలను సొంత రాజ్యంగా భావిస్తే, మరికొందరు అమేథీ, రాయ్‌బరేలీను తమ రాజ్యంగా చూస్తారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకుటుంబాలకు చెందిన వారసులు మాత్రమే ప్రధాని కాగలరన్న దుష్ట సంప్రదాయాన్ని ఈ ‘చాయ్ వాలా’ తుంగలో తొక్కాడని ప్రధాని అన్నారు. పేదవాడి కొడుకు సీఎం, ప్రధాని కావచ్చని ఆయన అన్నారు. మోదీ వారసత్వం పేదలకు శాశ్వత గృహాలు, దేశంలోని లక్షలాది మంది మహిళలకు మరుగుదొడ్లు, దళితులు, వెనుకబడిన తరగతులకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్, కుళాయి వంటి సౌకర్యాలు ఉన్నాయని ఆయన అన్నారు.
కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ టీకాకు వ్యతిరేకంగా ప్రజల్ని ప్రేరేపించాలని చూసిందని, అయితే వారు మాత్రం రహస్యంగా టీకాలు వేయించుకున్నారని ప్రధాని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతలు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు, అయితే కాంగ్రెస్, ఎస్పీలు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు లాక్కోవాలని చూస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్ల నుంచి యువరాజు(రాహుల్ గాంధీ) ఎన్నికల సమయంలో దేవాలయాలకు తిరుగుతున్నాడు, కానీ కాంగ్రెస్ మాత్రం అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను తిరస్కరించిందని అన్నారు.