Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపినట్లు చెప్పాడు. భారత్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపేశామని, ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోడీ, ట్రంప్‌కి తేగేసి చెప్పి కొన్ని గంటలకు అవ్వకముందే మరోసారి ట్రంప్ ‘‘నేనే యుద్ధం ఆపాను’’ అంటూ ప్రకటించుకున్నారు.
Read Also: Story Board: అహ్మదాబాద్ ఘటన తర్వాత తీరు మారలేదా..? ప్లేన్ ఎక్కే ప్రయాణికుడికి భరోసా ఏది..?
వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రధాని మోడీ ఒక ‘‘అద్భుతమైన వ్యక్తి’’ అని అభివర్ణించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని చెప్పారు. ‘‘నేనే యుద్ధాన్ని ఆపాను. నేను పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నాను. మోడీ అద్భుతమైన వ్యక్తి అని అనుకుంటున్నాను, నిన్న రాత్రి నేను అతనితో మాట్లాడాను. మేము భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము. నేను పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని ఆపాను’’ అని ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్ హౌజ్‌లో చర్చల తర్వాత ట్రంప్ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి యుద్ధం ఆపడంలో ఆసిమ్ మునీర్ చాలా ప్రభావవంతంగా పనిచేశారని ట్రంప్ కొనియారు. భారత్ వైపు నుంచి మోడీ ఈ సంఘర్షణ ఆపేలా పనిచేశారని ట్రంప్ చెప్పారు.
దీనికి ముందు బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్‌తో దాదాపు 3 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. భారత్ ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్‌కి స్పష్టం చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి చెప్పారు. మే 7-10 తేదీలలో రెండు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల తర్వాత అమెరికాతో వాణిజ్యం, భారత్-పాక్ మధ్యవర్తిత్వం గురించి అమెరికా ఎప్పుడూ చర్చించలేదని ప్రధాని ట్రంప్‌కి స్పష్టం చేసినట్లు తెలిపారు. “పాకిస్తాన్ నుండి వచ్చే ఏ దురాక్రమణ చర్యకైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని భారతదేశం కూడా స్పష్టం చేసింది” అని విదేశాంగ కార్యదర్శి అన్నారు.