Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానాన్ని అడుగుతున్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటకలో నాయకత్వ మార్పు లాభాలు, నష్టాల గురించి కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. సీఎం సిద్ధరామయ్య వారసుడిగా డీకే శివకుమార్‌కే అవకాశం ఉందని, ఇందులో మూడో వ్యక్తి పేరు లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకత్వ మార్పు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Read Also: Bitcoin Crash: క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ శకం ముగిసిందా? బిట్‌కాయిన్ క్రాష్‌కు కారణాలు ఏంటి..
ఇద్దరు నాయకుల బలాబలాల గురించి కాంగ్రెస్ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. సిద్ధరామయ్యకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓబీసీ వర్గాల్లో మంచి మద్దతు ఉంది, ప్రజా నాయకుడిగా పేరుంది. మరోవైపు, డీకే శివకుమార్‌కు సంస్థాగత సామర్థ్యాలు, ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలు ఉన్నాయని, ఇవి రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనంగా ఉంటాయని కొందరు నాయకులు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో వరస పరిణామాల నేపథ్యంలో డీకేకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. అయితే, ఇలాంటి ఒప్పందం ఏం జరగలేదని సిద్ధరామయ్య సన్నిహితులు చెబుతున్నారు. సీఎంగా పూర్తి కాలం ఆయనే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై స్పందించడానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిరాకరించారు.