Opposition Parties Meetings: నేడు బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 6 ప్రధాన అంశాలపై 24 పార్టీల నేతలు చర్చించనున్నారు. సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వాగతోపన్యాసం చేయనున్నారు. 7 గంటలకు రేపటి సమావేశానికి సంబంధించిన ఎజెండాను ప్రకటిస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీల నేతలకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందును ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభం కానుంది. సమావేశంలో 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవల్సిన ప్రధానమైన అంశాలపై చర్చిస్తారు. అనంతరం కూటమి ముందుకు సాగడం కోసం వివిధ సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నారు. వివిధ సబ్ కమిటీను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏర్పాటు చేయనున్నారు. సబ్ కమిటీల ఎన్నిక అనంతరం విపక్షాలను లీడ్ చేయడం కోసం ఒక నేతను కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ముగియనుంది. కూటమి సమావేశం అనంతరం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్‌ను నిర్వహించనున్నారు.
Read also: Police Harassment: పోలీసుల రాక్షసత్వం.. వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్‌కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్ (డీఎంకే), హేమంత్‌సోరెన్ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్‌ఎస్–యుబీటీ), శరద్‌పవార్ (ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌యాదవ్ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.