Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నిక కొలిక్కిరావడం లేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పైట్ తో మూడు సార్లు ఎన్నిక వాయిదా పడింది. దీంతో మరోసారి ఈ నెల 16 గురువారం రోజున మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఈ మేరకు ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఉదయం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Lithium: లిథియంను కనుగొనేందుకు భారతదేశానికి 26 ఏళ్ల పట్టింది..
జనవరి 6, 24, ఫిబ్రవరి 6 తేదీల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు జరిగినా.. బీజేపీ, ఆప్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొడంతో ఎన్నికల వాయిదా పడింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసి 10 మంది కౌన్సిలర్లు ఓటు వేయడానికి అనుమతించడాన్ని ఆప్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు మీటింగ్ లో ఓటేయకూడదు. దీనిపై ఇటు బీజేపీ, అటు ఆప్ పట్టువీడటం లేదు.
ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోవాలని చూస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించింది. 15 ఏళ్లుగా బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆప్. ఈ ఎన్నికల్లో 134 వార్డులను ఆప్ గెలుచుకోగా.. 104 వార్డులను బీజేపీ గెలుచుకుంది.