Delhi Firing: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్–24 ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. బైక్‌లపై వచ్చిన దుండగులు ఒక పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుడి కారుని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అని పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దాలతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు.
Read Also: High Court: వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టులో జడ్పీటీసీలు పిటిషన్ దాఖలు
అయితే, బాధిత వ్యాపారస్తుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు తెలియజేశాడు. ఇటీవల తనకు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందులో రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిపాడు. డబ్బులు చెల్లించకపోతే ప్రాణాలు తీస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల్లో ఉపయోగించిన ఆయుధాల గురించి ఆరా తీయడంతో పాటు కాల్ డేటా ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు వేట కొనసాగిస్తున్నాయి.