Delhi CM Oath Ceremony: భారతీయ జనతా పార్టీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు కట్టబెట్టింది. అయితే, హస్తినాలో 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ కూడా మహిళ సీఎం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. శాలీమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29, 595 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవి శంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్‌ల సమక్షంలో సమావేశమైన 48 మంది కమలం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తా ( ఓబీసీ నేత)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు.
Read Also: iPhone 16e: ఆపిల్ కొత్త ఐఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా
ఇక, ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నాలుగో మహిళగా ఆమె నిలవనుంది. మొదటి నుంచి చీఫ్ మినిస్టర్ రేసులో ఉన్న పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మకు నిరాశే ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన.. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం నాడు రాత్రి పార్టీ నేతలు వెంట రాగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీంతో సర్కార్ ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, రామ్‌లీలా మైదానంలో ఈరోజు(ఫిబ్రవరి 20) వేల మంది ప్రజల సమక్షంలో జరిగే రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. సుమారు 25 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.