దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక సమాచారం సేకరించాయి. కారు సునెహరి మసీదు నుంచి ఎర్రకోటకు వెళ్లింది. సునెహరి మసీదు పార్కింగ్ ఏరియాలో కారు మూడు గంటల పాటు ఉంది. ఆ సమయంలో కారులోనే డాక్టర్ ఉమర్ మహ్మద్ ఉన్నాడని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఎర్రకోట, సునెహరి మసీదు మధ్య దూరం 800 మీటర్లు. బర్ధార్ పూర్ బోర్డర్ నుంచి ఐ20 కారు ఢిల్లీలోకి ఎంటర్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీలోకి ప్రవేశించింది. కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Gold Price Today: వరుసగా రెండోరోజు షాక్.. రూ.2,460 పెరిగిన బంగారం ధర! వెండిపై 3 వేలు
కారు పేలుడులో సూత్రధారి ఉమర్ మహ్మద్ తల్లి, ఇద్దరు సోదరులు ఆషిక్ అహమ్మద్, జహూర్ అహమ్మద్‌లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఉమర్ పేలుడుకు పాల్పడినట్లుగా వార్తలు రావడంతో అతడి కుటుంబం నిర్ఘాంతపోయింది. డాక్టర్ అయిన ఉమర్ పైనే కుటుంబం అన్ని ఆశలు పెట్టుకుంది. డాక్టర్ అయి కుటుంబానికి ఆధారంగా ఉంటాడని ఆశపడ్డాం అని అతడి తల్లి చెప్పింది. కుటుంబం కోసం ఉమర్ ఎంతో కష్టపడ్డాడు అని పేర్కొంది. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.