అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. డేటా కోసం కచ్చితంగా బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపాల్సి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ యూఎస్‌కు పంపించాల్సి వస్తే.. ప్రొటోకాల్ ప్రకారం భారత అధికారుల బృందం కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ఇందులో రెండు పరికరాలు ఉంటాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లేదా సీవీఆర్, అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా ఎఫ్‌డీఆర్ ఉంటుంది. దీంట్లో సమాచారాన్ని కోడీకరించాలంటే యూఎస్‌కు పంపించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Doomsday Aircraft: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా ‘డూమ్స్‌డే విమానం’ ప్రత్యక్షం.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
ఇదిలా ఉంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా కూల్చేయాలని సూచించింది. భవన యజమాని అభ్యంతరాలుంటే 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం.. సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ అధికారులు భవనాలు లేదా చెట్లను స్వయంగా కూల్చే అధికారం కల్పించింది. ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలు ,వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణంగా తొలగించవచ్చని కేంద్రం తెలిపింది.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు కూడా మృతిచెందారు. పలువురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీని అధికారులు ఛేదిస్తున్నారు.