వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి.. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయి.. అధికారంలోఉన్న రాష్ట్రాల్లో పవర్ కోల్పోవడమే కాదు.. మిగతా రాష్ట్రాల్లో కూడా ఘోర పరాజయం తప్పలేదు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది.. ఈ భేటీకి జీ-23 అసమ్మతి నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఐదు రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్‌లు, ఐదు రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.
Read Also: Vijayashanti: బీజేపీ గెలిచిన భయంతోనే కేసీఆర్ ఆస్పత్రికి..!
సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు 57 మంది కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు పంపగా.. అనారోగ్యం కారణాల వల్ల మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ మినహా.. మిగతా నేతలంతా హాజరయ్యారు.. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో జీ-23 అసమ్మతి నేతలు పార్టీ సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తమ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది.. దీంతో.. సీడబ్ల్యూసీలో ఎలాంటి చర్చ సాగింది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే ఉంది..