సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. కరోనా నివారణకు తీసుకునే కోవోవాక్స్ టీకా ధరను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు కోవోవాక్స్ వ్యాక్సిన్ డోస్ ధర రూ.900 ఉండగా.. రూ.225కి తగ్గిస్తున్నట్లు సీరమ్ కంపెనీ తెలిపింది. అయితే జీఎస్టీ అదనంగా ఉంటుందని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకాను తీసుకుంటే సర్వీస్ ఛార్జీగా రూ.150 వరకు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా కరోనా టీకా ధరను తగ్గించిన విషయాన్ని సీరం కంపెనీ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి అందించారు. ఈ టీకాను పెద్దల కోసం వినియోగించవచ్చని గత ఏడాది భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. అనంతరం 12-17 సంవత్సరాల మధ్య పిల్లలకు కూడా వాడవచ్చని తెలిపింది. ప్రస్తుతం 12 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ టీకాలు వేస్తున్నారు. అటు 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు భారత్ బయోటెక్ ఆధ్వర్యంలోని కొవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తున్నారు.