ఇండియాలో కరోనా తీవ్రత కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా బీఏ4, బీఏ5 వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు తాజాగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజూవారీ కరోనా కేసులను వెల్లడించింది. కేసుల సంఖ్య 3 వేల కన్నా తక్కువగానే ఉన్నా.. గత నాలుగైదు రోజుల నుంచి నెమ్మదిగా కేసులు పెరిగాయి.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియాలో 24 గంటల్లో కొత్తగా 2,828 కేసులు నమోదు అయ్యాయి. శనివారంతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాల సంఖ్య చాలా వరకు తగ్గింది. కరోనా బారిన పడి నిన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 2035 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డెయిలీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది.
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,31,53,043 మంది కోలుకున్నారు. వీరిలో 5,24,586 మంది మరణించగా.. 4,26,11,370 కరోనా బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారికి 1,93,28,44,077 డోసులను ఇచ్చారు. నిన్న 13,81,764 మందికి టీకాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 53,13,79,033 మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 63,10,376గా ఉంది.