Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ పడుతున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గేతో పాటు శశి థరూర్ పోటీలో నిలిచారు. చివరి నిమిషంలో దిగ్విజయ్ సింగ్ తప్పుకోవడంతో తెరపైకి అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు వచ్చింది. గతంలో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారని అనుకున్నప్పటికీ.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కారణంగా అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ముగ్గురు వ్యక్తులు బరిలో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లతో పాటు జార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కేఎం త్రిపాఠి ఉన్నారు.
Read Also: Websites ban: 67అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేసిన కేంద్రం
ఇదిలా ఉంటే మల్లికార్జున ఖర్గేను అనూహ్యంగా తెరపైకి తీసుకురావడానికి దళిత ముద్రే కారణం అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా మల్లికార్జున ఖర్గే విజయం ఖాయం అయింది. దక్షిణ భారత దేశానికి ప్రాతినిథ్యం కల్పించేందుకు ఖర్గేను ఎంపిక చేసుకునట్లు తెలుస్తోంది. దీనికి తోడు త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నింటి దృష్టిలో పెట్టుకునే ఖర్గేను పోటీలోకి దింపింది కాంగ్రెస్. గతంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా దళిత నేతలు దామోదరం సంజీవయ్య, బాబూ జగ్జీవన్ రామ్ పనిచేశారు. ఖర్గే ద్వారా కాంగ్రెస్ దళిత సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ నేతల మద్దతు ఆయనకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే జీ 23 లీడర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల మద్దతు ఖర్గేకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది నేతలు ఖర్గేకు మద్దతు పలికారు. ఏకే ఆంటోని, దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ , భూపీందర్ హుడా, అభిషేక్ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, మనీష్ తివారీ, పృథ్వీరాజ్ చవాన్ వంటి నేతలు ఖర్గేకు మద్దతు ప్రకటించారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 19 రోజున ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపుగా 25 ఏళ్ల తరువాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రానున్నారు.