Websites ban: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు రావడంతో చదువుకునే పిల్లలకు ఫోన్లు తప్పనిసరై పోయాయి. పిల్లల చేతికి ఫోన్లు చేరడంతో వారంతా వాటితో ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. టీనేజ్.. ఇది ఆకర్షణలకు గురయ్యే వయసు. మీడియాలో పెరుగుతున్న అశ్లీలత్వం కారణంగా వారికి అడల్ట్ కంటెంట్ కనిపిస్తే.. ఊహకే భయంగా కనిపిస్తుంది కదూ.. అందుకే కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో పెరిగిపోతున్న పోర్న్ సైట్లపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సైట్లను బ్యాన్ చేసింది.
ఇంటర్నెట్ లో రకరకాల పోర్న్ సైట్లు నేడు అందుబాటులో ఉన్నాయి. పిల్లల విషయంతో వాటి ఉనికి ప్రమాదకరంగా ఉండడంతో 67పోర్న్ సైట్లపై నిషేధం విధించింది. ఆ వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆదేశాల్లో వెల్లడించింది. మహిళలు, చిన్నారుల మానానికి, గౌరవానికి భంగం కలిగించేలా పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి జాబితా అందింది. వీటిలో 63 వెబ్‌సైట్ల జాబితాను పూణె కోర్టు అందివ్వగా, మరో నాలుగు వెబ్‌సైట్ల పేర్లతో కూడిన జాబితాను ఉత్తరాఖండ్ హైకోర్టు అందజేసింది.
అసత్య వార్తలు, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, మార్ఫింగ్ వీడియోల పై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే 10 యూట్యూబ్ ఛానెళ్లకు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసింది. అగ్నిపథ్, కశ్మీర్, ఆర్మీ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది ప్రకటించిన ఐటీ చట్టం గైడ్ లైన్స్ ను పట్టించుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 67 వెబ్ సైట్లు అశ్లీల వీడియోలను నిర్వహిస్తున్నట్టుగా పుణె కోర్టు, ఉత్తరాఖండ్ హై కోర్టుల నుంచి కేంద్రానికి వేర్వేరుగా ఆదేశాలు అందాయి. గతంలోనూ అనేక సందర్భాల్లో పోర్నోగ్రఫిక్ కంటెంట్ ప్రోత్సహించే బూతు వెబ్‌సైట్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది.