congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని చాలాసార్లు అభ్యర్థించానని.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్షుడిగా ఉండకూడదని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే.. రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకే వ్యక్తికి ఒకే పదవి అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24 నుంచి అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించనున్నారు.
Read Also: Cambodia: కాంబోడియాలో చిక్కుకున్న కరీంనగర్ యువకులు.. విదేశాంగకు బండిసంజయ్ లేఖ
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో ఉండేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అశోక్ గెహ్లాట్ పోటీలో ఉన్నానని స్పష్టం చేయగా.. శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, మనీస్ తివారీ, కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్ వంటి వారుకూడా పోటీలో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గాంధీ కుటుంబం ఏ అభ్యర్థికి సపోర్ట్ చేయదని రాహుల్ గాంధీ నాయకులకు స్పష్టం చేశారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 17న ఎన్నికను నిర్వహించి.. అక్టోబర్ 19 ఫలితాలను ప్రకటించనుంది కాంగ్రెస్.
గురువారం కేరళలో మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేవలం పదవి మాత్రమే కాదని.. అది ఒక భావజాలానికి ప్రతీక అని.. ఓ రకంగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని అన్నారు.