కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సూచించారు. ఇదిలా ఉంటే శింతన్ శిబిర్ తొలి రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు.
కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అందుల్లోంచి బయటకు రావాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ ఒక కుటుంబానికి… ఒకే టికెట్’ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు పార్టీ చాలా ఇచ్చింది… పార్టీకి మనం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగతంగా పార్టీలో పనిచేయాలని… కనీసం పార్టీలో 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. స్వార్థాన్ని వీడాలని నేతలకు అధిష్టానం సూచించింది. పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామనే సందేశాన్ని పార్టీ నాయకులకు తెలిపారు సోనియాగాంధీ. ఇదే విధంగా పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండాలని.. మళ్లీ ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. పార్టీలోని నాయకులు, పార్టీలో పనిచేయని తమ బంధువులకు టికెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.
రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతులు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేశారు. ఈ కమిటీలు రూపొందించిన తీర్మానాలపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆమోదించనుంది.