Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయడానికి సమావేశం కాబోతోంది. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల్లో 60 సీట్లపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: USA: 2050 నాటికి న్యూయార్క్‌తో సహా సముద్రంలో కలవనున్న 32 నగరాలు..
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పనిచేస్తోంది. అయితే, 90 సీట్లు ఉన్న మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. మహారాష్ట్రలోని 48 సీట్ల కోసం మిత్రపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బెంగాల్‌లో తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీని శాంతింపచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఇక తెలంగాణలోని 17 స్థానాలపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండటంతో అభ్యర్థులపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కి సవాల్‌గా ఉన్నప్పటికీ, దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కోరుతోంది. ఈ రోజు జరగబోయే సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది.